కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 265 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఆన్లైన్లోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ పాల్గొన్నారు.
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భవనాల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వినియోగంలో లేని ప్రభుత్వ భవనాలను అవసరమైన వివిధ శాఖలకు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై విస్తృత అవగాహన కల్పించాలని మెప్మా, డిఆర్డిఓ అధికారులకు సూచించారు. ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శుల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలోని ఎరువుల విక్రయం కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.