కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాకవి, పద్మ విభూషణ్ గ్రహీత కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజి చేసిన కృషిని, నిజాంకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాలను కొనియాడారు. ఆయన గొప్ప ప్రజాకవి మాత్రమే కాకుండా, ప్రజల పక్షాన నిలబడిన ఒక ఉద్యమకారుడని అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీ వెంకటరమణ, శ్రీ భీం రావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రజినీకాంత్ (అడ్మిన్), శ్రీధర్ రెడ్డి (వెల్ఫేర్) తో పాటు మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.