గన్నేరువరం, కరీంనగర్ జిల్లా – కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేసిన కసాయి కొడుకుల పట్ల సామాజికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, శుక్రవారం “ది రిపోర్టర్” టీవీ చానెల్‌లో ప్రసారమైన కథనంపై గన్నేరువరం ఎస్‌ఐ నరేందర్ రెడ్డి వెంటనే స్పందించారు.
95 ఏళ్ల వృద్ధురాలు వొడ్నాల లచ్చవ్వను కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి గెంటివేసిన దృశ్యాలు ప్రసారమైన వెంటనే, రాత్రి 9 గంటల సమయంలో ఎస్సై నరేందర్ రెడ్డి తన పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లైన వెంకటేష్, రమేష్‌లను లచ్చవ్వ చిన్న కుమారుడు బలరాం నివాసానికి పంపించారు.
కానిస్టేబుళ్లు ఇంటికి వెళ్లి లచ్చవ్వను చూసుకుని, ఆమెను మంచిగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను ఆదేశించారు. వృద్ధ మాతృమూర్తికి అన్యాయం జరగకుండా చూడాలని హెచ్చరించారు.
“ది రిపోర్టర్” కథనంపై సత్వర చర్యలు తీసుకున్న ఎస్సై నరేందర్ రెడ్డి చర్యలను గ్రామస్థులు హర్షించడంతోపాటు, పోలీసులు ఇలా స్పందించడం అభినందనీయమని అన్నారు. వృద్ధులను తక్కువచూసే సమాజంలో ఇలాంటి తక్షణ చర్యలు మరెందరో అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రజలు అభిప్రాయపడ్డారు.