కరీంనగర్ జిల్లా: మేమున్నాం’ అనే ధైర్యాన్ని, భరోసాను కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారు. కరీంనగర్ పోలీసు కమీషనరేట్‌లోని మహిళా పోలీసులు. పోలీసు శాఖలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ, కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం వినూత్నమైన ‘షీ-లీడ్స్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, మహిళా పోలీసులను ‘విజిబుల్ పోలీసింగ్’లో ముఖ్య భాగస్వామ్యం చేసేందుకు వారికి ‘బ్లూ కోల్ట్స్’ విధులు కేటాయించడం, ఈ ఆలోచన ఇప్పటికే సత్ఫలితాలనిస్తోంది. ప్రజలకు భద్రతపై మరింత దృఢమైన నమ్మకాన్ని కల్పించడంలో మహిళా బ్లూ కోల్ట్స్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో సంఘటనలు ఎదురైనపుడు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా మహిళా పోలీసులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం అని సీపీ తెలిపారు.
- క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సవాళ్లకు సమగ్ర శిక్షణ
- ‘పోలీసు శాఖలో విధులు నిర్వహించాలంటే శారీరక ధృడత్వంతో పాటు మానసికంగా కూడా ధృడంగా ఉండాలని, మనల్ని మనం రక్షించుకునే స్థితిలో ఉన్నపుడే ప్రజలను రక్షించగలం’ అని సీపీ గౌష్ ఆలం ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ నినాదానికి అనుగుణంగానే, దాదాపు 100 మంది మహిళా పోలీసులకు (షీ టీమ్స్ సభ్యులతో సహా) రెండు దశల్లో కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణను అందిస్తున్నామని తెలిపారు.
కరాటే (అన్ ఆర్మ్డ్ కంబాట్ కోర్స్):
ఆత్మరక్షణ విద్యలో సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని, వీరు తమను తాము రక్షించుకోవడమే కాక, ఆపదలో ఉన్న పౌరులకు రక్షణ కల్పించేలా వీరికి శిక్షణ అందిస్తున్నామన్నారు.
- నిరసనకారుల నిర్వహణపై శిక్షణ:
ధర్నాలు, నిరసనల్లో ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెళకువలుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ సున్నితమైన అంశాలను ఎలా సమర్థంగా, మానవీయంగా నిర్వహించాలో నేర్పిస్తున్నామన్నారు.
- మానసిక ఒత్తిడి అధిగమనం:
కఠినమైన క్షేత్ర స్థాయి విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు, పోలీసులకు మానసిక ధృడత్వాన్ని పెంచేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని సీపీ తెలిపారు.
- భరోసాకి కొత్త అర్థం
క్షేత్ర స్థాయిలో సంఘటనలు ఎదురైనపుడు, ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా ఈ శిక్షణ మహిళా పోలీసులను సన్నద్ధం చేస్తోంది. విధి నిర్వహణలో నిరంతర అప్రమత్తత అవసరమని, నేర్చుకున్న ఈ అంశాలను అవసరమైతే తప్పకుండా ఉపయోగించుకోవాలని సీపీ మహిళా పోలీసులకు సూచించారు. కరీంనగర్ పోలీసు కమీషనరేట్ తీసుకున్న ఈ ‘షీ-లీడ్స్’ చొరవ, మహిళా శక్తిని కేవలం కార్యాలయానికే పరిమితం చేయకుండా, ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారికి మరింత దగ్గరయ్యేలా చేస్తుందని సీపీ ఆశాభావం వ్యక్తం చేసారు. మహిళా బ్లూ కోల్ట్స్ బృందం వీధుల్లో తిరుగుతుంటే, తమకు రక్షణ ఉందనే ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రజల్లో మరింత పెరుగుతాయని సీపీ అభిప్రాయ పడ్డారు. ఈ వినూత్న సంస్కరణ ద్వారా కరీంనగర్ పోలీసు శాఖ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి సత్ఫలితాలనిస్తుందని సీపీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీ శ్రీనివాస్ జి, వేణుగోపాల్, మాధవి కరాటే మాస్టర్ వసంత్ కుమార్ ఇతర ఇన్స్పెక్టర్లు మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









