కరీంనగర్ జిల్లా: కొత్తపల్లి మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) అనుమానాస్పద హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేధించారు. ఈ హత్య భూ తగాదాలు మరియు వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం జరిగినట్లు, హత్య చేసిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
◆ కేసు వివరాలు
మల్కాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు దేవునూరి సతీష్‌కు, మృతుడు కవ్వంపల్లి దినేష్‌కు మధ్య భూమి అమ్మకం విషయంలో కమీషన్ గొడవలు ఉన్నాయి. అలాగే, దినేష్ మరో నిందితుడు దేవునూరి సంతోష్‌ను, ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్న విషయంపై చంపుతానని పలుమార్లు బెదిరించాడు. దీంతో సంతోష్ తన అన్న దేవునూరి శ్రావణ్‌కు విషయం చెప్పగా, దినేష్ వలన తమ ఇద్దరికీ ముప్పు ఉందని భావించి, దినేష్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.
◆ హత్య జరిగిన విధానం:
తేదీ 25-02-2024 నాడు దేవునూరి శ్రావణ్ వాళ్ళ వదిన చనిపోవడంతో, అక్కడికి వచ్చిన దినేష్‌ను మట్టుబెట్టాలని నిందితులు పథకం పన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నిందితులు కరీంనగర్ నుండి ఒక ఎర్టిగా కారును (AP 09 CT 3007) కిరాయికి తీసుకువచ్చారు. అదే రోజు సాయంత్రం దేవునూరి సతీష్, దినేష్‌ను మద్యం తాగించడానికి తన యమహా బైక్ (TS 02 FE 7785) పై కరీంనగర్ తీసుకెళ్లాడు. అనంతరం మద్యం సేవించిన తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్‌ను తీసుకొచ్చి, మిగతా నిందితులతో కలిసి దినేష్‌ను చితకబాదారు. అక్కడి నుండి కారులో ఎక్కించుకొని జగిత్యాల వైపు వెళ్తూ, నూకపల్లి గ్రామ శివారులో కారును ఆపి, సతీష్ నల్లని తాడుతో దినేష్ మెడకు బిగించి హత్య చేసే ప్రయత్నం చేసాడు. అనంతరం అందరూ కలిసి దినేష్ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు.
◆ ముఖ్య గమనిక: ఈ కేసులోని ప్రధాన నిందితులైన దేవునూరి సతీష్ మరియు శ్రావణ్‌లు గతంలో గంగాధరలో ఒక వృద్ధురాలిని హత్య చేసిన కేసులో కూడా నిందితులుగా ఉండి జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.
◆ అరెస్ట్ వివరాలు:
విశ్వసనీయ సమాచారం మేరకు చొప్పదండి సి.ఐ మరియు సిబ్బంది మల్కాపూర్ గ్రామంలోని దేవునూరి శ్రావణ్ ఇంటి వద్ద దాడి చేసి, అక్కడ ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన కారు మరియు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
◆ నిందితుల వివరాలు:
● దేవునూరి సతీష్ (30 సం,, మల్కాపూర్) – ప్రధాన నిందితుడు
● దేవునూరి శ్రావణ్ (28 సం,, మల్కాపూర్)
● దేవునూరి రాకేష్ (24 సం,, మల్కాపూర్)
● కుమ్మరి వికేష్ (26 సం,, మోతె గ్రామం)
● జంగ చిన్నారెడ్డి (25 సం,, మల్కాపూర్)
● దేవునూరి సంతోష్ (28 సం,, మల్కాపూర్ – కుట్రలో భాగస్వామి)
నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రూరల్ ఏసీపీ విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు చేదించుటలో కృషి చేసిన చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై లు నరేష్ రెడ్డి (చొప్పదండి), వంశీకృష్ణ,(గంగాధర) రాజు (రామడుగు), సాంబమూర్తి (కొత్తపల్లి) మరియు వారి సిబ్బందిని పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.









