● వాగీశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన
● రాజీవ్ రహదారి, రేణికుంట తదితర ‘బ్లాక్ స్పాట్’ల పరిశీలన
కరీంనగర్ జిల్లా: రోడ్డు ప్రమాద రహిత కరీంనగర్ సాధనే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం, ఐపీఎస్ తెలిపారు. ఈ రోజు కరీంనగర్ వాగీశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని, రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలు మరియు వాటి నివారణ మార్గాలపై విద్యార్థులకు, సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చని సీపీ సూచించారు.
◆ బ్లాక్ స్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన:
ప్రమాదాల నివారణలో భాగంగా సీపీ ఇటీవల రాజీవ్ రహదారి, రేణికుంట, నుస్తులాపూర్, కొత్తపల్లి మరియు అల్గునూరు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. గతంలో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లిన ‘బ్లాక్ స్పాట్’ (Black Spots) లను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల సాంకేతిక కారణాలను విశ్లేషించి, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఆయా చోట్ల ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, ఎల్.ఎం.డి. ఎస్సై శ్రీకాంత్, గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.









