- సీపీ గౌష్ ఆలం పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు.
◆ నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు
మొదటి విడతలో చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ (05) మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. దీనికోసం జిల్లావ్యాప్తంగా 33 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. సీపీ గౌష్ ఆలం ఈ కేంద్రాల్లో పలు చోట్ల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
◆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సందర్శన
అంతేకాకుండా, పలు గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్థానిక పోలీసు అధికారులతో కలిసి సీపీ గురువారంనాడు సందర్శించారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఈ కేంద్రాల వద్ద పోలింగ్ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
◆ ఎన్నికల నియమావళి అమలు, బైండోవర్ చర్యలు
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో భాగంగా, గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రామడుగు (రాజు ), గంగాధర (వంశీకృష్ణ), చొప్పదండి (నరేష్ రెడ్డి ) తో ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.









