కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు విశేష సేవలందించిన ఇద్దరు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం శనివారంనాడు కరీంనగర్ కరీంనగర్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది.ఆర్.ఎస్సై కాంతయ్య ఏ.ఆర్. పోలీస్ హెడ్ క్వార్టర్స్ విభాగం నుండి, ఎస్సై అజ్మత్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి పదవీ విరమణ పొందారు.
కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీ భీంరావు ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ, అనేక సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా, నిబద్ధతతో పూర్తి చేసి పదవీ విరమణ పొందడం ఒక గొప్ప విజయమని కొనియాడారు. అధికారులు అందించిన సేవలకు వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని, ఆ సహకారం వల్లే వారు సమర్థవంతంగా పనిచేయగలిగారని గుర్తు చేశారు. పదవీ విరమణ తర్వాత అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
అడిషనల్ డీసీపీ శ్రీ భీంరావు స్వయంగా పదవీ విరమణ పొందిన ఇరువురు ఎస్సైలకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ (సంక్షేమం) శ్రీ మేడ కిరణ్ కుమార్, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడాల సురేందర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.









