కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేటు కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం 63వ హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం హోంగార్డుల అమూల్య సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, హోంగార్డ్ వ్యవస్థ దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని ఉద్ఘాటించారు. మన దేశంలో ఈ వ్యవస్థను 1946లో బాంబేలో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ”అత్యవసర పరిస్థితులలో తక్షణ స్పందన, సమర్థవంతమైన బందోబస్తు విధులు, మరియు ప్రజా రక్షణ చర్యల్లో హోంగార్డుల సేవలు అమూల్యం” అని సీపీ కొనియాడారు.
విధుల్లో అంకితభావం మరియు ప్రతిభ కనబరిచిన హోంగార్డులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.
ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వాలీబాల్ మరియు ఇతర క్రీడా పోటీల్లో విజయం సాధించిన సిబ్బందికి ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. క్రీడా కార్యక్రమాలు సిబ్బందిలో శారీరక సామర్థ్యం మరియు మానసిక ఉల్లాసం పెంపొందించడంలో తోడ్పడతాయని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు విజయకుమార్, వెంకటస్వామి, యాదగిరిస్వామి, హోంగార్డు ఆర్.ఐ. శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు పాల్గొన్నారు.









