contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రామడుగు మండలంలో హత్య కేసు ఛేదన .. ఐదుగురు నిందితుల అరెస్ట్

కరీంనగర్ జిల్లా: రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంజయ్య (36) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో తండ్రి, భార్యే సుపారీ ఇచ్చి అంజయ్యను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

◆ ​ఘటన వివరాలు:
​పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపూర్ నివాసి గాదె లచ్చయ్య (63) తన కోడలు శిరీషతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. 2017లో ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన అంజయ్య, 2019లో తిరిగి వచ్చిన తర్వాత తండ్రి, భార్యల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి వారిని మందలించాడు. దీనితో తమ సాన్నిహిత్యానికి అడ్డుగా ఉన్న అంజయ్యను వదిలించుకోవాలని తండ్రి, భార్య పథకం వేశారు.

◆ ​రూ. 3 లక్షలకు సుపారీ:
​నేరుగా చంపితే అనుమానం వస్తుందని భావించిన లచ్చయ్య, అదే గ్రామానికి చెందిన కొలిపాక రవి సహాయంతో సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించాడు. రవి తన బంధువైన ఉప్పరపల్లి కోటేశ్వర్, అతని స్నేహితుడు మహమ్మద్ అబ్రార్‌లకు అంజయ్యను చంపేందుకు రూ. 3 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజయ్యతో స్నేహం పెంచుకున్న కోటేశ్వర్, అబ్రార్‌లు గత కొన్ని రోజులుగా అతనితో కలిసి మద్యం సేవించేవారు.

◆ ​పథకం ప్రకారం హత్య:
​ఈ నెల 02వ తేదీన మద్యం తాగుదామని అంజయ్యను ఊరి చివర కెనాల్ సమీపంలోకి పిలిచారు. అక్కడ అతనికి అమితంగా మద్యం తాగించి, మత్తులోకి జారుకున్న తర్వాత కోటేశ్వర్ గొంతు నులమగా, అబ్రార్ చేతులు పట్టుకుని అంజయ్యను హతమార్చారు. నిందితుడు రవి దగ్గరుండి ఈ విషయాన్ని లచ్చయ్యకు చేరవేశాడు. సాక్ష్యాలను మరుగుపరచడానికి చీకటి పడిన తర్వాత మృతదేహాన్ని D-8 కెనాల్‌లోకి తోసేశారు.

◆ ​పోలీసుల దర్యాప్తు:
​తేదీ 05-12-2025న కాలువలో శవం దొరకడంతో, ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల లోతైన విచారణలో లచ్చయ్య, శిరీషల ప్రవర్తనపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

◆ ​అరెస్టయిన నిందితులు:
​గాదె లచ్చయ్య (63)(మృతుడి తండ్రి)
​గాదె శిరీష(32) (మృతుడి భార్య) ​ఉప్పరపల్లి కోటేశ్వర్(31) (సుపారీ హంతకుడు)
​మహమ్మద్ అబ్రార్(23) (సుపారీ హంతకుడు)
​కొలిపాక రవి (55)(మధ్యవర్తి)
​స్వాధీనం చేసుకున్న వస్తువులు:
​నేరానికి ఉపయోగించిన ఫోన్లు మరియు బైక్ (TS02L1367).
​నిందితుల వద్ద నుండి సుమారు రూ. 40,000/- నగదు (మిగతా మొత్తం రికవరీ చేయాల్సి ఉంది).

​కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :