కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు నిఘాను మరింత కఠినతరం చేశారు. గడిచిన ఏడాది కాలంలో (01/01/2025 నుంచి 31/12/2025 వరకు) నగరవ్యాప్తంగా వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీ సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. కరీం ఉల్లాఖాన్ వెల్లడించారు.
నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 750 అత్యాధునిక సి.సి. కెమెరాల ద్వారా, సిబ్బంది ప్రత్యక్షంగా ఉండకుండానే ఆన్‌లైన్ విధానంలో చలానాలు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సాంకేతిక నిఘా వ్యవస్థ వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత ఏడాది నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు ఇలా ఉన్నాయి:
ట్రిపుల్ రైడింగ్: 68,484
హెల్మెట్ లేకుండా ప్రయాణం: 59,426
రాంగ్ సైడ్ డ్రైవింగ్: 36,211
ఆన్ రోడ్ పార్కింగ్: 16,607
సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం: 6,662
డ్రంక్ అండ్ డ్రైవ్: 3,242
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు: 3,148
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎం.డి. కరీం ఉల్లాఖాన్ మాట్లాడుతూ, “నగర ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం. జరిమానాలు విధించడం కోసం కాదు, ప్రతి పౌరుడు సురక్షితంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా యువత ట్రిపుల్ రైడింగ్‌ను పూర్తిగా మానుకోవాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సి.సి. కెమెరాల ద్వారా నేరుగా చలానాలు ఇంటికే వస్తాయని, కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









