కరీంనగర్ జిల్లా: సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో గన్నేరువరం మండల ప్రజలకు ఎస్సై జి. నరేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలు, ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరి పాటించాలన్నారు. ఊరికి వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసేముందు తలుపులు, కిటికీలు,గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఎస్సై నరేందర్ రెడ్డి సూచించారు. ఇళ్లలో,ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా?రికార్డింగ్లో ఏమైనా సమప్యలు ఉన్నాయా?నైట్ విజన్ సక్రమంగా ఉందా! అనే అంశాలను పరిశీలించుకోవాలన్నారు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే మొబైల్ ఫోన్ యాప్ తో లైవ్ ఫుటేజీ చెక్ చేసుకునేలా సీసీ కెమెరాలను సెట్ చేసుకోవాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లినప్పుడు పక్కింటి వారికి, నమ్మకస్తులకు చెప్పి వెళ్లాలని అన్నారు. రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వేయాలన్నారు.ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు.ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు గమనించినట్లయితే డయల్ 100 సమాచారం అందించాలని మండల ప్రజలను కోరారు.ప్రజల సహకారం తోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









