కరీంనగర్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్ నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను వివరించారు.
గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకరమని సీపీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో అధిక శాతం సీట్‌బెల్టు ధరించకపోవడం, హెల్మెట్ వినియోగించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి మానవ తప్పిదాల వల్లే చోటు చేసుకున్నాయని చెప్పారు.
ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులే ఉండటం గమనార్హమని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్ర డీజీపీ ప్రారంభించిన ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు పరిసరాలను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా తన విద్యార్థి దశలో ఎదురైన అనుభవాలను ఉదాహరణగా చెబుతూ రోడ్డు భద్రత ప్రాముఖ్యతను సీపీ విద్యార్థులకు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరి స్వామి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాస్వామి, డాక్టర్ సాయిదీప్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నీలం సంపత్, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డితో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










