● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్.
● భక్తులకు అసౌకర్యం కలగకుండా బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణపై కీలక ఆదేశాలు.
కరీంనగర్ జిల్లా: స్థానిక రేకుర్తిలో (జనవరి 28 నుండి 31 వరకు) అత్యంత వైభవంగా జరగనున్న సమ్మక్క-సారక్క జాతరను పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గారు గురువారం బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. జాతర జరిగే ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, బందోబస్తు మ్యాప్‌ను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జాతర ప్రాంగణంలో నిరంతర నిఘా కోసం ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, భక్తులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.
జాతర సమయంలో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను కేటాయించి, రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు. భక్తుల దర్శనం సజావుగా సాగేలా ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు.
అనంతరం ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సీపీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ విజయకుమార్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ మరియు ఇతర పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.









