కరీంనగర్ జిల్లా వేములవాడలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ బుర్ర ఎల్లయ్య గౌడ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్‌ను ప్రకటించింది. ఆదివారం రోజున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఇండియన్ పోలీస్ మెడల్ పథకంలో ఆయనకు ఈ గౌరవం లభించడం జిల్లాకే గర్వకారణంగా మారింది. పోలీస్ శాఖకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారం అందజేశారు.
బుర్ర ఎల్లయ్య గౌడ్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. 1985లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరిన ఆయన, 1991లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. 2001లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా, 2013లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ప్రమోషన్ పొంది వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
తన సుదీర్ఘ సేవాకాలంలో సేవా పతకం, మహోన్నత పతకం సహా ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్‌ను పొందడం ఎంతో గర్వకారణమని అధికారులు తెలిపారు. ఆయనకు ఇప్పటివరకు 150 మెరిటేరియస్ ప్రశంసా పత్రాలు, 40 క్యాచ్ రివార్డులు, పలుమార్లు జీఎస్సీ అవార్డులు లభించాయి.
1992లో విధుల నిర్వహణలో భాగంగా ఒక ఆపరేషన్‌కు వెళ్లిన సమయంలో జరిగిన ప్రమాదంలో బావిలో పడిపోవడం జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలతో బయటపడగా, ఒక కానిస్టేబుల్ మృతి చెందడం జరిగింది. ఆ కఠిన పరిస్థితులనుంచి బయటపడి మరింత ధైర్యంగా సేవలు కొనసాగించడం ఆయన సేవా నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.
తీవ్రవాదుల ఏరివేత, నేర నియంత్రణలో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న బుర్ర ఎల్లయ్య గౌడ్, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ముఖ్యంగా పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వృత్తిపరంగా వారికి సహాయ సహకారాలు అందించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
ప్రజలందరితో మృదుస్వభావంతో వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందిన బుర్ర ఎల్లయ్య గౌడ్‌కు ఇండియన్ పోలీస్ మెడల్ లభించడం గౌడ జాతికే కాకుండా పోలీస్ శాఖకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఆయన 2026 జూన్ 26న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆత్మీయులు బుచ్చి రాముడు గౌడ్, నాగయ్య గౌడ్, రాజమౌళి గౌడ్‌లతో పాటు తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ సంఘ సభ్యులు, ఆడరేవుల ప్రెసిడెంట్, రిటైర్డ్ అదనపు ఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్ గౌడ్, అదనపు ఎస్పీ మహేష్ గౌడ్, డీఎస్‌పీ నాగేందర్ గౌడ్, డీఎస్‌పీ లక్ష్మణ్ బాబు, సీఐ చంద్రశేఖర్ గౌడ్, సీఐ ముత్తిలింగయ్య, సీఐ సిహెచ్ మల్లయ్య తదితరులు హార్దిక శుభాభినందనలు తెలిపారు.








