కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్వహించనున్నట్లు ఆలయ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకునే ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

గన్నేరువరం గ్రామంలో రెండు గుట్టల మధ్య మేడారం తరహాలో ఈ జాతర నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ఐదు గద్దెలు ఉండగా, చుట్టూ మానేరు డ్యామ్, పెద్ద చెరువు, పల్లె ప్రకృతి వనం, పచ్చని చెట్లు ఉండటంతో జాతర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతోంది. జాతర రోజున చిలకలగుట్టపై నుంచి వనదేవతలను పూజారులతో తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు.

సమ్మక్క సారలమ్మ ఆలయానికి దక్షిణంగా పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, తూర్పున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, ఉత్తరాన హనుమంతుని గుట్ట, పడమర వైపున శివుని ఆలయం ఉండటం విశేషం.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్, త్రాగునీరు, వైద్య సేవలు, బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. కరీంనగర్ నుంచి వెంకట్రావుపల్లి మీదుగా పొత్తూర్–గన్నేరువరం వరకు, అలాగే కరీంనగర్ నుంచి గుండ్లపల్లి, మాదాపూర్, ఖాసీంపేట మీదుగా గన్నేరువరం సమ్మక్క సారలమ్మ దేవాలయం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
జాతర ముఖ్య ఘట్టాలు
బుధవారం రాత్రి 11 గంటలకు బుర్ర మల్లయ్య సరలమ్మను చిలకలగుట్ట నుంచి సారలమ్మ గద్దెకు తీసుకువచ్చారు. గురువారం రాత్రి 9 గంటలకు సమ్మక్కను బోయిని మల్లయ్య గద్దెకు తీసుకురానున్నారు. శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకోనుండగా, శనివారం సాయంత్రం ఐదు గంటలకు వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు.

వెంకీ మంకీ హాజరుతో జాతరకు ప్రత్యేక ఆకర్షణ
ఇటీవల గన్నేరువరం మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎఫ్–3 మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మేడారం సమ్మక్క సారలమ్మ సాంగ్ చిత్రీకరణ జరగగా, ఆ పాట హిట్ కావడంతో జబర్దస్త్ టీం లీడర్ వెంకీ మంకీ తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వెంకీ మంకీని శాలువతో ఘనంగా సత్కరించారు.
వెంకీ మంకీ దర్శనంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.









