కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయానికి ఆదివారం విశేష భక్తి వాతావరణంలో విరాళ కార్యక్రమం జరిగింది. కరీంనగర్‌కు చెందిన విజయ్ మసాలా డ్రైఫ్రూట్స్ నిర్వాహకుడు అక్కేనపెల్లి రాజేష్ దంపతులు ఆలయానికి రెండు కిలోల వెండి శివలింగం మరియు తోరణాన్ని భక్తి శ్రద్ధలతో బహుకరించారు.
ఈ సందర్భంగా రాజేష్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు, కమిటీ సభ్యులు పాల్గొని దాతలను అభినందించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామస్థులు మాట్లాడుతూ, ఇలాంటి విరాళాలు ఆలయ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.








