కరీంనగర్ జిల్లా: నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నాడు నగరంలోని ‘వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్నర్’ (I Town Corner) వద్ద వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు (Special Drive) నిర్వహించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా ప్రధానంగా, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు, అస్పష్టంగా ఉన్న లేదా ట్యాంపరింగ్ (Tampering) చేసిన నంబర్ ప్లేట్లు, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాలపై చర్యలు తీసుకున్నారు.
ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 43 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహన యజమానులపై జరిమానా విధించడంతో పాటు, నిబంధనల ప్రకారం సరైన నంబర్ ప్లేట్లను బిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీమ్ ఉల్లా ఖాన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ మాట్లాడుతూ,”వాహనదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టమైన నంబర్ ప్లేట్లను కలిగి ఉండాలని, నంబర్ ప్లేట్లను మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం చట్టరీత్యా నేరం. నేరాల నియంత్రణలో నంబర్ ప్లేట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.








