కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధ్యక్షతన బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలను (CD Files) సమర్పించి, కేసుల పురోగతిపై సమగ్ర వివరాలు అందించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, అలాగే ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల (Grave Crimes) దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అలాగే పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్, CEIR పోర్టల్ వినియోగం, సీసీటీవీ కెమెరాల జియో-ట్యాగింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఆన్లైన్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ, NDPS చట్టం అమలు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ తనిఖీలు ముమ్మరం చేయాలని, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా త్వరగా పరిష్కరించాలని కూడా సీపీ ఆదేశించారు.
ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వేణుగోపాల్, శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, సతీష్‌తో పాటు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.








