contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అవగాహన, నిబంధనల పాటించుటతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

  • ‘అరైవ్ – అలైవ్’ మూడవ దశలో అవగాహనా సదస్సు
  •  గత ఏడాది 200 మంది మృతిపై సీపీ ఆందోళన
  •  ఆటో డ్రైవర్లు, రాపిడో కెప్టెన్లకు దిశానిర్దేశం – ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసలు

కరీంనగర్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి వాటిని బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.

సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక అస్త్ర కన్వెన్షన్ హాల్‌లో ఆటో డ్రైవర్లు మరియు రాపిడో కెప్టెన్ల కోసం ఏర్పాటు చేసిన ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) మూడవ దశ అవగాహనా కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత ఏడాది కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి మానవ తప్పిదాలే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్పష్టం చేశారు.

ప్రమాదాల్లో మృతులలో 85 శాతం మంది పురుషులే ఉండటం గమనార్హమని, ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని అన్నారు.

కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే రహదారుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హుజురాబాద్ లింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇప్పటికే సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రతి డ్రైవర్ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవాటు చేసుకోవాలని, పరిసరాలను గమనిస్తూ జాగ్రత్తగా వాహనం నడపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ లోకేష్ బృందం ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే సీపీఆర్ (CPR) విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులపై చట్టాల గురించి వివరించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి ‘రహవీర్’ పథకం కింద ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ఇన్స్పెక్టర్లు సంజీవ్, కుమారస్వామి, కిరణ్ కుమార్, మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ లోకేష్, రాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :