కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ–జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలకు దాదాపు 800 సంవత్సరాల ప్రాముఖ్యత ఉందని నిర్వాహకులు తెలిపారు.
మంగళవారం గౌడ సంఘం సభ్యులు అమ్మవారిని ఊరేగింపుగా పుట్టకు తీసుకెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటి నుండి భక్తులు బోనాలు సమర్పించి, లందె నుంచి ఎల్లమ్మను ఎదుర్కొని గడ ఊరేగింపుగా డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని కొనసాగించారు.
మంగళవారం, బుధవారం రోజుల్లో గావు పట్టుట, సిద్ధులు తిరుగుట, అమ్మవారి కళ్యాణం వంటి ముఖ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం నాడు వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉడుదాల ఎల్లమ్మ గుడి నిర్మాణం పూర్తి
ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉడుదాల ఎల్లమ్మ గుడి నిర్మాణాన్ని గన్నేరువరం గ్రామానికి చెందిన బుర్ర సాధన, శ్రీకాంత్ దాతలుగా ముందుకు వచ్చి పూర్తి చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితం వెలిసిన నాగపుట్ట వద్ద నాగుల పంచమి రోజున భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గుడి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదంతో తమ కోరికలు నెరవేరాయని, ఇప్పుడు భక్తులు ప్రశాంతంగా పూజలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. సిద్ధోగం రోజున గుడిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
విద్యుత్ దీపాల వెలుగులో దేవాలయం
ఎల్లమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు గౌడ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మరియు పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్ తెలిపారు.
పోలీసుల బందోబస్తు ఏర్పాటు
ఎల్లమ్మ సిద్ధోగం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దేవాలయం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై నరేందర్ రెడ్డి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.






