కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం : గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు జనరల్ ఓరియంటేషన్ రెండవ విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. మండల వ్యాప్తంగా ఈ శిక్షణను రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ రెండవ విడత శిక్షణలో భాగంగా చీమలకుంటపల్లి, గుండ్లపల్లి, గుండ్లపల్లి ఎక్స్ రోడ్, గునుకుల కొండాపూర్, గోపాల్పూర్, హన్మాజిపల్లి, జంగపల్లి, మాదాపూర్ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు ఏప్రిల్ 6 నుండి 10 వరకు శిక్షణ అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, ఆదర్శ గ్రామాల ప్రణాళిక, పారిశుద్ధ్యం (శానిటేషన్), ఈ-పంచాయతీ అప్లికేషన్లు, భవన అనుమతులు, పన్నుల వసూలు విధానం, రికార్డు నిర్వహణ, ఉపాధి హామీ పథకం, మంచినీటి సరఫరా, ఆదాయ-వ్యయాల నిర్వహణ వంటి అంశాలపై వార్డు సభ్యులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. అదనంగా వార్డు సభ్యుల బాధ్యతలు, కర్తవ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టీఓటీలు), పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, నూతన వార్డు సభ్యులు పాల్గొన్నారు. అధికారులు ఈ శిక్షణ ద్వారా గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








