కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు స్థానిక నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చెక్కిళ్ల తిరుపతి గౌడ్, బోడ నరసింహారెడ్డి లు పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇకపై ఈ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.








