జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి అనే యువతి, రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి చిత్తారి హరిబాబును ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వీరి దాంపత్య జీవితం సజావుగా సాగుతుండగా, నిన్న రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు సమాచారం.
ఈ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో, ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య వైష్ణవిపై భర్త హరిబాబు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం సుమారు 4 నుంచి 5 గంటల మధ్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం హరిబాబు ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో ఇంటి నుంచి పరారైనట్టు సమాచారం.
ఈ ఘటనపై వైష్ణవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను వేధించి హత్య చేసిన హరిబాబుతో పాటు అతని తల్లిదండ్రులకు కూడా కఠిన శిక్ష విధించాలని, లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సమాచారం అందుకున్న కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.








