కోరుట్ల (జగిత్యాల జిల్లా): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. గర్భిణీ అయిన వైష్ణవి అనుమానాస్పద మృతి ఘటనలో భర్తతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెట్‌పల్లి డీఎస్పీ రాములు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్య వైష్ణవిని కట్నం వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో హరిబాబుకు సహకరించినట్లు భావిస్తున్న కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు.
బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)లపై కట్న వేధింపులు, హత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఈ కేసులో దర్యాప్తు నిర్వహించిన ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసులు గురువారం నిందితులు లక్ష్మి, ఆనంద్, అశోక్‌లను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించారు.
ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.








