- దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల పై ప్రత్యేక దృష్టి
- ఎవరైనా హింసకు పాల్పడితే ఉపేక్షించం
పల్నాడు జిల్లా, కారంపూడి : సోమవారం 13 వ తేదీ జరగబోవు ఎన్నికల నేపథ్యంలో కారంపూడి సర్కిల్ ఉన్న 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నామని ఈరోజు మీడియాతో కారంపూడి సర్కిల్ సిఐ టి. నారాయణ స్వామి అన్నారు. సిఐ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల హింసాత్మక సంఘటనల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ పరిస్థితుల్లో ఎవరినన్నా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా ఎవరి కేటాయించిన బూత్ లలో వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఎవరు ఒక చోట గుంపులు గుంపులుగా ఉండరాదని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేసే చర్యలు ఉన్నా ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా దుర్గి మండలం, రెంటచింతల మండలం లో గల కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో ఇప్పటికే అందరికి ఈ విషయాలపై అవగాహనా కల్పించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్, డిజిపి ల ఆదేశాల ప్రకారం, పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు ఉంటాయని, గతంలో రౌడీ షీట్, బైండ్ ఓవర్ కేసులను కూడా నమోదైన వారిపై గట్టి నిఘా ఉంటుందని, పరిధి మీరితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. భద్రతా పారా మిలటరీ బలగాలను కూడా ఈ మూడు మండలాల్లో భారీగా దించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు జరిగే బూత్ లలో ఏజంట్లు, ఎన్నికల అధికారు తప్ప ఎవరికీ అనుమతి ఉండదని, కేవలం అనుమతి కలిగిన వారికీ మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటుందన్నారు. బూత్ లలో ఫోటోలు, వీడియోలు నిషిద్ధం అని, సిసి కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. రాత్రి వేళ 9 గంటలు దాటినా తరువాత హోటళ్లు, రెస్టారెంట్లు విధిగా మూసివేయాలని ఆయన తెలిపారు.