contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు 20 జనవరి 1940లో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్లపాటు జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టారు. 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు. 1977, 1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 1986లో వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.

2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఐదున్నర దశాబ్దాల కెరియర్‌లో బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీసావిత్రి, పల్నాటి పౌరుషం, తాతామనవడు, టూటౌన్ రౌడీ తదితర 187 సినిమాల్లో నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లోనూ సత్తా చాటారు. గోపీకృష్ణ మూవీస్ పతాకం పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ కృష్ణంరాజు ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగానూ పనిచేశారు. కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :