కర్ణాటక : ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు తదితర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తుంది.. మరి బెంగళూరులో ఏ రోడ్డు చూసినా అధ్వానమే, డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రభుత్వానికి పన్నులు ఎందుకు కట్టాలంటూ ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్ ఫోరం ప్రశ్నించింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాసింది. ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైన గ్రేటర్ బెంగళూరు అధికారులను ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించింది.
ఇటీవల రోడ్లపై గుంతల విషయంలో సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధికారులు స్పందించి వాటిని పూడుస్తున్నారని టాక్స్ పేయర్స్ ఫోరం పేర్కొంది. అయితే, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా రోడ్లపై గుంతలను పూడ్చడం వల్ల ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించింది. ఇటీవలి వర్షాలకు బెంగళూరులో పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం గుర్తుచేస్తూ.. డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తే వరద ముప్పు తప్పుతుందని వెల్లడించింది. ప్రజలకు సేవలందించే విషయంలో అధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని తన లేఖలో కోరింది.
ఉపముఖ్యమంత్రి డీకే స్పందన..
బెంగళూరు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేస్తూ.. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలను పూడ్చివేసే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 13 వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. రోడ్లపై గుంతలు, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా రూ.1100 కోట్లతో బెంగళూరులోని 550 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు.