ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ‘ఇప్పుడున్న సిటీని ముంచేసి ఫ్యూచర్ సిటీ కడతాడట’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిటీకి మెట్రోను రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి మెట్రో ప్రణాళిక వేయడంలోనే రేవంత్ రెడ్డి చావు తెలివితేటలు బయటపడ్డాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాసాలు రాస్తున్నాడని కేటీఆర్ గుర్తుచేశారు.
అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే.. ‘మా ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడంలేదని వరల్డ్ బ్యాంకుకు లేఖలు రాస్తున్నాడు’ అని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంత అధ్వాన్నంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రూపంలో ప్రజలకు మంచి అవకాశం దొరికిందని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసేందుకు బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.