హైదరాబాద్: రాష్ట్రంలోని 60 లక్షల మంది తెరాస కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం మరోసారి ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. దీనికోసం రూ.26.11 కోట్ల వార్షిక ప్రీమియం చెల్లించింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘‘తెరాస కార్యకర్తలకు ఆరేళ్లుగా ప్రమాద బీమా సౌకర్యం అమలు చేస్తున్నాం. ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన 4వేల మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచాం. 70 సంవత్సరాల్లోపు వయసున్న కార్యకర్తలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, దివ్యాంగులయితే రూ.లక్ష, పాక్షికంగా దివ్యాంగులైతే రూ.50 వేల బీమా భరోసా అందుతుంది.’’ అని ఆయన తెలిపారు.