తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాలమూరులో అక్టోబరు 1న జరిగే ఎన్నికల శంఖారావ సభకు మోదీ వస్తుండడాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సభ ద్వారా బీజేపీ తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండగా… పాలమూరులో అడుగుపెట్టే నైతిక హక్కు మోదీకి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా అని, దేశంలో ఏ నిర్మాణం జరుగుతున్నా అక్కడ పాలమూరు కూలీలు కనిపిస్తారని ఓ నానుడి ఉందని వివరించారు. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లాకు మోదీ ఏంచేశారని కేటీఆర్ ప్రశ్నించారు. అసలు, సభ జరపాలని పాలమూరును ఎందుకు ఎంచుకున్నారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు.
“మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారు మీరు? 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న మా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓ లేఖ తీసుకుని మీ వద్దకు వచ్చారు. నీటి అంశంలో జరిగిన అన్యాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓ ప్రాతిపదికగా ఉంది… మహబూబ్ నగర్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా… గోదావరి, కృష్ణా జలాల్లో వాటా తేల్చాలి… మీరు ట్రైబ్యునల్ కు సిఫారసు చేస్తే చాలు… మాకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కుతుంది అని మా ముఖ్యమంత్రి మీకు వివరించారు.
ఇది జరిగి తొమ్మిదన్నరేళ్లు అవుతోంది. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం తెలంగాణలో మేజర్ ప్రాజెక్టులు. ఒకటి కృష్ణా నదిపై, మరొకటి గోదావరి నదిపై ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని ప్రధానిని కోరాం. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే… కరవులు, కన్నీళ్లు, వలసలతో వేదన అనుభవించిన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి, ఆయన పార్టీకి కన్నుకుడుతోంది. ఓవైపు కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, జాతీయ హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడరు… కానీ పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెంబెత్వాకు, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కనబెట్టారు.
ప్రధానమంత్రికి ఒక్కటే చెబుతున్నా… పాలమూరు గడ్డపై అడుగుపెట్టేటప్పుడు ముందు ఇక్కడి ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన 811 టీఎంసీల నీటిలో, మా వాటాగా 500 టీఎంసీల నీటిని మాకివ్వాలన్న డిమాండ్ ను గుర్తిస్తారో, గుర్తించరో చెప్పండి.
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడంలేదని నితిన్ గడ్కరీ చెబుతుంటారు. కానీ మీది (బీజేపీ) ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం. బీజేపీ అసలు జాతీయ పార్టీనో, కాదో కూడా చెప్పాలి. నన్నడిగితే మీదసలు జాతీయ పార్టీనే కాదు. తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్భాజీ పార్టీ మీది.
గతంలో ఎన్నికల సమయంలో సుష్మ స్వరాజ్, అమిత్ షా వంటి నేతలు ఇక్కడికి వచ్చి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మాటిచ్చారు. జాతీయ హోదా ఇవ్వకపోగా అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. పర్యావరణ, సాంకేతికపరమైన అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ప్రాజెక్టు డీపీఆర్ లకు ఇష్టానుసారం కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం కాదా?
కృష్ణా జలాలపై ఒక్క లేఖ రాయడానికి చేయి రావడం లేదు… కనీసం సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్ కు సిఫారసు చేయడానికి కూడా ప్రధానమంత్రికి తీరికలేదా? కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడంలేదా? కృష్ణా జలాలపై ఈ నికృష్ట రాజకీయం ఎందుకు?” అని అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.