హైదరాబాద్ : “మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అనే విషయం చాలా మందికి తెలుసు. అయినా దాన్ని మానేయడం చాలా మందికి సాధ్యపడటం లేదు. అయితే కేవలం ఆరు నెలల పాటు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండగలిగితే శారీరకంగా, మానసికంగా ఎన్నో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌ను దూరం పెట్టినప్పుడే శరీరం నిజమైన ఆరోగ్య స్థితికి చేరుకుంటుందని వారు తెలిపారు. ఈ ఆరు నెలల కాలంలో శరీరంలో జరిగే ఎనిమిది ముఖ్యమైన మార్పులు ఇవే:
1. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది:
ఆల్కహాల్‌ను శరీరం నుండి తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించే కాలేయం మద్యం వల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. అయితే మద్యం మానేస్తే కాలేయం స్వయంగా తాను కోలుకొని, దాని పనితీరు మెరుగుపడుతుంది.
2. నిద్ర నాణ్యత పెరుగుతుంది:
మద్యం తాగితే నిద్ర వచ్చిందనేది అపోహ మాత్రమే. ఇది నిద్రలయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మద్యానికి దూరమైన కొన్ని వారాల్లోనే గాఢమైన నిద్రను అనుభవించవచ్చు.
3. బరువు తగ్గడం సాధ్యం:
ఆల్కహాల్‌లో అధికంగా ఉండే ఖాళీ క్యాలరీలు శరీరాన్ని అధిక బరువు వైపు నడిపిస్తాయి. మద్యం మానేసినప్పుడు శరీర జీవక్రియ వేగవంతమవుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
4. మానసిక ప్రశాంతత:
ఆల్కహాల్ డిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. దీని వలన కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. మద్యం మానేసిన తర్వాత మెదడులో న్యూరోకెమికల్స్ సమతుల్యంలోకి వచ్చి, మానసిక స్థితి మెరుగవుతుంది.
5. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది:
ఆల్కహాల్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. దీని వలన చర్మం పొడి పొడిగా మారుతుంది. మద్యం మానిన తర్వాత చర్మానికి తేమ అందుతుంది. దాంతో పాటు కాంతి, ఆరోగ్యం పునరుద్ధరమవుతుంది.
6. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
మద్యం శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనంగా చేస్తుంది. ఆరు నెలల మద్య విముక్తి తర్వాత తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరిగి, శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలంగా పోరాడుతుంది.
7. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది:
మద్యం అధికంగా తీసుకోవడం వలన రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులకు దారి తీస్తుంది. మద్యం మానితే ఇవన్నీ క్రమంలోకి వచ్చి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
8. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది:
ఆల్కహాల్ జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. ఇది శరీరం పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. మద్యం మానిన తర్వాత జీర్ణక్రియ సజావుగా సాగి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.