ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయకుడు-ప్రతినాయకుడు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన అంటూ చంద్రబాబు ఢిల్లీ టూర్ ను ప్రస్తావించిన నారా లోకేశ్… ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటన అంటూ పిన్నెల్లిని జగన్ పరామర్శించడాన్ని ఎత్తిచూపారు.
“అధికారులు, ఎంపీలు, రాష్ట్రమంత్రులతో కలిసి చంద్రబాబు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. ప్రధానిని కలిసి ఇవీ నిర్దిష్టంగా రాష్ట్ర తక్షణ అవసరాలు అని విన్నవించారు. కానీ ప్రతినాయకుడు… అక్రమాలు, అరాచకాలలో ఆరితేరి, చివరికి పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేని పరామర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం పెట్టుకున్న తొలి పర్యటన నెల్లూరు జిల్లా జైలు” అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఇక, ఏపీ సీఎం మలి పర్యటన అంటూ రేపు హైదరాబాద్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అంశాన్ని లోకేశ్ ప్రస్తావించారు. అదే సమయంలో జగన్ మలి పర్యటన పోక్సో చట్టం కింద అరెస్టయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ అయ్యుంటుందని అంచనా వేశారు.
“రేపు తెలంగాణ ముఖ్యమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నారు. మరి 1+6+4 సీట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడి మలి పర్యటన…. బాలికలను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టయి కర్నూలు జైలులో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ?” అంటూ లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.