ఢిల్లీ : ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించి, వారికి మెరుగైన జీవితాన్ని అందించే లక్ష్యంతో లోక్‌సభలో ఒక ఆసక్తికరమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. పనివేళలు ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో వచ్చే ఆఫీస్ ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్‌కు స్పందించకుండా ఉండే హక్కును ఉద్యోగులకు చట్టబద్ధంగా కల్పించాలనేది ఈ బిల్లు ప్రతిపాదన.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్‌సభలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఒక ‘ఉద్యోగుల సంక్షేమ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్ యుగంలో పెరిగిపోతున్న పని ఒత్తిడిని తగ్గించి, ఉద్యోగులకు మెరుగైన పని-జీవిత సమతుల్యతను (work-life balance) కల్పించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని సుప్రియా సూలే తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.
ఇదే తరహాలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. భారతదేశంలో 51 శాతం మంది ఉద్యోగులు వారానికి 49 గంటలకు పైగా పనిచేస్తున్నారని, 78 శాతం మంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటలను పరిమితం చేయడం, మానసిక ఆరోగ్యానికి మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సృష్టించాలని ఆయన తన బిల్లు ద్వారా కోరారు.
అయితే, ఈ బిల్లులు ప్రైవేట్ మెంబర్ బిల్లులు కావడం గమనార్హం. మంత్రులు కాకుండా ఇతర ఎంపీలు ప్రవేశపెట్టే బిల్లులను ప్రైవేట్ మెంబర్ బిల్లులు అంటారు. సాధారణంగా పార్లమెంటులో ఇలాంటి బిల్లులు చట్టరూపం దాల్చడం చాలా అరుదు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం తర్వాత చాలావరకు వీటిని ఉపసంహరించుకుంటారు.









