అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై ప్రభుత్వ (AP Govt) అత్యవసర విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా?.. కుట్ర పూరితమా? అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనను ప్రభుత్వం అంత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. మరికొద్దిసేపట్లో డీజీపీ, సిఐడీ చీఫ్ మదనపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు.
కాగా… మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గత అర్థరాత్రి కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆఫీసులోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కంప్యూటర్లు, పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. అయితే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కానీ… కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరి విచారణలో… ఇది అగ్నిప్రమాదమా? కుట్రకోణమా? అనే నిజానిజాలు బయటపడనున్నాయి.










