పార్వతీపురం మన్యం జిల్లా,జియ్యమ్మ వలస మండలం, రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆశాడే సందర్భంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కె.వి. ఎస్. పద్మావతి సందర్శించి క్షేత్రస్థాయిలో వైద్య సేవల పనితీరును పరిశీలించారు. ఈ పర్యటనలో ఆమె ఆసుపత్రిలోని అటెండెన్స్ రిజిస్టర్, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. రోగులకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం పీహెచ్ సి వైద్య అధికారి డాక్టర్ చీకటి శంకర్రావు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోషకాహార లోపం, సీజనల్ వ్యాధుల నివారణపై కీలక సూచనలు చేశారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలలో పోషకాహార లోపాలు లేకుండా చూసుకోవాలని అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులైన జ్వరం డెంగ్యూ మలేరియా వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే వాటిని సకాలంలో గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లకు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
