పార్వతీపురం మన్యం జిల్లా: కొమరాడ మండలంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా కార్యాలయాల్లో, ఆసుపత్రులలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తెలియజేశారు. పర్యటనలో భాగంగా, జాయింట్ కలెక్టర్ మొదట కొమరాడ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుమోటో కుల ధృవీకరణ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఉన్న ఫైళ్లను, ధృవీకరించిన మ్యుటేషన్ ఫైళ్లను కూడా పరిశీలించారు. అలాగే, ‘ఈ-పంట’ ధృవీకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ-పంటను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కొమరాడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పూర్తిగా పరిశీలించి, అందులోని అన్ని విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు. స్టాఫ్ రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్, లేబర్ రూమ్, ఓపీ డిస్పెన్సరీ రూమ్‌ను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, వాటి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.
వైద్య అధికారులతో మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ అత్యంత పరిశుభ్రంగా, శుభ్రతతో నిర్వహించాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
