పార్వతీపురం మన్యం : ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. అలాగే విద్యార్థినుల్లో రక్తహీనత సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శుక్రవారం జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. కురుపాంలోని ఆం.ప్ర.గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రతీ విద్యార్థినికి తొమ్మిది పాయింట్ల కంటే రక్తం తక్కువ ఉండరాదని అన్నారు. క్యారెట్, మునగాకు, పోషకాలు కలిగిన ఆహారంతో మంచి ప్రయోజనం ఉన్నందున, వాటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. వయసుకు తగిన బరువు, ఎత్తుతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తహీనత ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రక్తహీనత సమస్యలు ఉన్న అమ్మాయిలకు సరైన పౌష్టికాహారం అందించిన పిదప, మరోసారి హెమోగ్లోబిన్ టెస్ట్ చేయించాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, విద్యా శాఖ అధికారులకు మార్గదర్శకాలను జారీచేశారు. ఈ సందర్బంగా హాస్టల్ విద్యార్థులకు త్వరగా హెచ్బీ పర్సెంటేజ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కురుపాం సీహెచ్సీ వైద్యునికి ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తూ, విద్యార్థులతో కలిసి భుజించి, ఆహార నాణ్యత ప్రమాణాలను రుచి చూశారు. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యతో పాటు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. అందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముందుగా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అంబులెన్సు ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. లాగ్ బుక్ ను పరిశీలించి, అంబులెన్సు లో ఉన్న పరికరాలు,ఎమర్జన్సీ కిట్ తదితర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు సత్వర సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వాతావరణం కనిపించేలా పరిసరాలను తీర్చిదిద్దాలని వైద్యాధికారులకు సూచించారు. పాము, కుక్క కాటుకు గురైనవారు, జ్వరంతో బాధపడే చిన్న పిల్లలు, గర్భిణీల ఓపిని పరిశీలించిన కలెక్టర్ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు, భోజన సదుపాయాల గురించి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు.ఆసుపత్రుల్లో మందుల కొరత ఉండరాదని, సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉద్బోదించారు.
ఈ పర్యటనలో ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. జి.నాగభూషణరావు, సీహెచ్సీ వైద్యాధికారి డా. డి. చైతన్య, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఆర్.కృష్ణవేణి, కురుపాం ఆం.ప్ర.గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.అనురాధ, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.