- కెమిశీల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
- కాలం చెల్లిన ఆహార పదార్థాలు… సక్రమంగా అమలు కాని మెనూ..
- సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సమస్య లను జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన రిపోర్టర్ టివి ప్రతినిధి
గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహాలలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలు, నిర్లక్ష్యం, మరియు విద్యార్థుల మరణాలు, అనారోగ్య సమస్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడం వంటి కారణాల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
పార్వతీపురం మన్యం జిల్లా లోనీ కొమరాడ మండలం కెమిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఆకలి కేకలు తప్పటం లేదు.. ఆ ఆశ్రమ పాఠశాలలో 3 వ తరగతి నుంచి 8 వ తరగతి వరకు మొత్తం 71 మంది విద్యార్థులు ఉండగా శుక్రవారం మధ్యహ్న భోజన సమయంలో రిపోర్టర్ టీవీ ప్రతినిధి సందర్శించగా కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన విద్యార్థుల కోసం వసతి గృహ సంక్షేమ అధికారినీ ప్రశ్నించగా .. ప్రశ్నించడానికి నువ్వెవరు అంటూ పాత్రికేయుల పై దురుసుగా ప్రవర్తిచాడు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థులను మెనూ నిర్వహణ పై ఆరా తీయగా సక్రమంగా అమలు చేయడం లేదనీ, వారానికి ఒక్క ఆదివారం రోజే గుడ్డు పెడుతున్నారని, పాలు పూర్తిగా ఇవ్వటం లేదని విద్యార్థులు భయం భయంగా చెప్పలేక కంటి చూపుతో, సైగలతో చెప్పకనే చెప్తున్నారు. విద్యార్థుల పరిస్థితిని గమనించిన మీడియా ప్రతినిధి అనుమానంతో ఆరాతీస్తే పలు విషయాలు బయటబడ్డాయి. స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే విద్యార్థుల పై వత్తిడి తీసుకొచ్చి, వచ్చిన అధికారుల ముందు అంతా బాగానే ఉందని, ఎటువంటి లోపం లేదని చెప్పించడం పరిపాటైపోయింది. అధికారులు ఎవరైనా సందర్శనకు వస్తున్నారంటే వేరే ఆహార పదార్థాలు మార్చి అధికారుల ముందు నటించడం సర్వసాధారణమైంది. న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను కూడా బెదిరించే స్థాయికి ఎదిగిన అక్కడి వార్డెన్ / హెచ్ ఎం పై చర్యలు తీసుకునే అధికారి లేకపోవడం గమనించదగ్గ విషయం. అధికారుల పర్యవేక్షణ లోపించడం, బాధ్యతారాహిత్యం వంటివి సమస్యలకు దారితీస్తున్నాయి.
కాలం చెల్లిన ఆహారంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:
కొన్ని సంఘటనలలో, విద్యార్థులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, అనారోగ్యం బారినపడటం వంటివి జరుగుతున్నాయి. కెమిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో శుక్రవారం వెళ్లిన పాత్రికేయులకు అక్కడే ముక్కిన చోడి పిండి, బెల్లపు చక్కిలు, మినప గుళ్ళు, బఠాణి లు ఆర బెట్టినవి, పూర్తిగా పాడై, పురుగులు పట్టినట్లు గుర్తించారు. ఇటువంటి కాలం చెల్లిన ఆహార పదార్థాలను విద్యార్థులకు సరఫరా చేస్తే ప్రాణహాని కలగదా ! అని వసతి గృహ అధికారిని ప్రశ్నించ గా గిరిజన సహకార సంస్థ నుంచి మాకు అలాంటివే సరఫరా చేశారని పొంతన లేని సమాధానంతో తప్పించుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వమే కాలం చెల్లిన ఆహార పదార్థాలు విద్యార్థులకు పంపి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టా లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అక్కడి వార్డెన్ వ్యవహరిస్తున్నట్టా …!
పర్యవేక్షణ లోపం ఆ విద్యార్థులకు శాపం:
ఉన్నతాధికరుల పర్యవేక్షణ లోపం ఆ గిరిజన విద్యార్థులకు శాపంగా మారింది . ఎప్పటికప్పుడు వసతిని గృహాలు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు చేతి వాటం కారణంగా తూ తూ మంత్రంగా చూసి చూడ నట్లు వ్యవహరిస్తుండటం తో గిరిజన విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ఇటువంటి వసతి గృహాల పై దృష్టి సారించాల్సి ఉంది.
కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి దృష్టి కి సమస్యలను తీసుకెళ్లిన రిపోర్టర్ టీవీ ప్రతినిధి:
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడం లేదని, విద్యార్థుల ఆరోగ్యానికి హానికరమైన పద్ధతులు అవలంబిస్తున్నారని, వీడియో, ఫోటోలు తో సహా శుక్రవారం కురుపాం కు వచ్చిన కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్యకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
కల్తీ ఆహారం వల్ల మనిషికి హాని ( లేదా మరణం) జరిగితే, క్రింద తెలిపిన సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు:
IPC సెక్షన్లు: 272, 273, 337, 338, 304A
FSSAI సెక్షన్లు: 26, 59
జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 (పిల్లల రక్షణకు):
సెక్షన్ 75 – పిల్లలపై క్రూరత్వానికి శిక్ష: శారీరక, మానసిక బాధ కలిగిస్తే: 3 సంవత్సరాల వరకు జైలు మరియు ₹1 లక్ష జరిమానా ఉంటుంది. కావున హాస్టల్ వార్డెన్లు గతంలో మాదిరిగా అమాయక గిరిజన బిడ్డల జీవితాలతో చెలగాటమాడుకుంటారా లేక .. చట్టపరమైన చర్యలకు పాత్రులవుతారా !