ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో వారిని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
అంతకుముందు, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో తమకు అరెస్ట్ ముప్పు పొంచి ఉందని భావించిన వారు, సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వారిని అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన ఘటనలో పిన్నెల్లి సోదరులపై మే 25న పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద నమోదు చేసిన ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గా, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని ఏ7గా చేర్చారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పిన్నెల్లి సోదరులకు తాత్కాలికంగా అరెస్ట్ నుంచి ఉపశమనం లభించినట్లయింది.