చేగుంట, మెదక్ జిల్లా: చేగుంట మండల కేంద్రంలో బీసీ జె ఏసి (BC JAC) ఆధ్వర్యంలో బీసీ బంద్ శనివారం పూర్తి స్థాయిలో కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపునకు స్పందనగా, అఖిలపక్షం నాయకులు నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఉదయం నుంచే చేగుంట పట్టణంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు స్వచ్ఛందంగా మూతపడాయి. బీసీలకు మద్దతుగా స్థానిక వ్యాపారులు, ప్రజలు ముందుకు వచ్చారు.
బీసీ జెఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు బీసీల హక్కుల కోసం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “బీసీలకు న్యాయం చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం తప్పనిసరి. అన్ని పార్టీలు ఈ డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం రిజర్వేషన్ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎన్నికలు జరగాలి,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ (MRPS) నాయకులు సహా అనేక మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీల హక్కుల కోసం చేపట్టిన ఈ బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా కొనసాగింది.