ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట మండలం శివారులో, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి వద్ద అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా సంచరిస్తూ గ్రామస్థుల్లో ఆందోళనలు సృష్టించిన చిరుత మృతిచెందింది.
సోమవారం మధ్యాహ్నం పశువులను మేపుతున్న రైతు చందా బిక్షపతికి ఆ చిరుత ఎదురుపడింది. రైతు కేకలు వేయడంతో ఆ చిరుత పొదల్లోకి పరుగెత్తింది. ఈ విషయాన్ని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు.
రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ, “చిరుత దాదాపు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నదని, ఎక్కడో గాయపడి బలహీన స్థితికి చేరడంతో సహజంగానే మృతిచెందినట్లు అనుమానిస్తున్నాము” అని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బయోలాజికల్ పార్క్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
అటవీ శాఖ అధికారులు గ్రామస్థులు, రైతులు అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.










