తూప్రాన్ డివిజన్, మెదక్ జిల్లా: జాతీయ రహదారి 44 (NH-44) పై జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మహిళ మృతిచెందగా, భర్త మరియు ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందూ, ఆయన భార్య పాటి లక్ష్మీ, చిన్నారి తనయ్ (6) శనివారం మాసాయిపేట మండలం రామంతాపూర్‌లోని జాన్ స్కూల్‌కు వెళ్లి ఫీజులు చెల్లించుకుని తిరిగి తమ గ్రామానికి వస్తున్నారు. ఈ సమయంలో, వెనుక నుండి వచ్చిన కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనలో పాటి లక్ష్మీ అక్కడికక్కడే మృతిచెందగా, చందూకు తలకు తీవ్ర గాయాలు, చిన్నారి తనయ్‌కు కూడా గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ పైలెట్ భాను సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన తండ్రి, కుమారుడిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తూప్రాన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ జంగం రమేష్ మాట్లాడుతూ: “ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గాయపడిన వారిని చికిత్సకు కావాల్సిన సహాయం అందిస్తున్నాం,” అని తెలిపారు.










