మెదక్ జిల్లా – తూప్రాన్ పట్టణంలో ప్లాట్ల కోసం అవుసుల కుంట కట్టను అక్రమంగా తవ్వి నేలమట్టం చేసిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ప్రజల ఆందోళన నేపథ్యంలో సోమవారం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
కట్టను రాత్రికి రాత్రే తవ్విన జేసీబీ వాహనం నంబర్‌కు సంబంధించిన వీడియోలను ఇరిగేషన్ అధికారులు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ తవ్వకాల వెనుక కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
పోలీసుల దర్యాప్తులో మున్సిపల్ మాజీ ప్రతినిధి సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికార సంస్థలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆరోపణల నేపథ్యంలో కొందరు స్థానిక నేతలు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును వినియోగించి ఆయన ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటన జరిగిన మూడు రోజులు గడిచినా స్పష్టమైన పరిపాలన చర్యలు కనిపించకపోవడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బయటి వ్యక్తుల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఏ శాఖా అధికారికంగా స్పందించలేదు.
కుంట కట్ట వంటి విలువైన ప్రభుత్వ స్థలం అక్రమంగా తవ్వబడినా, ఆ ప్రాంతంలోని ముఖ్య రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మౌనం వహించడం ప్రజల్లో సందేహాలకు తావిస్తుంది.
మెయిన్ రోడ్ పక్కనే డివిజన్ కేంద్రంలో ఉన్న ఈ కుంట కట్ట స్థలం అక్రమ ఆక్రమణకు గురవుతుండడం, భవిష్యత్తులో చెరువులు, కుంటలు ఇలాగే మాయం కావచ్చన్న భయం ప్రజల్లో పెరుగుతోంది.
ఈ కేసులో ఉన్నతాధికారుల జోక్యం తప్పనిసరిగా అవసరమని, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.











