తూప్రాన్ డివిజన్ – రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తూప్రాన్ పోలీసులు నిఘా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూప్రాన్ పీఎస్ పరిధిలో కీలక గ్రామంగా గుర్తించిన గణపూర్‌లో బుధవారం సాయంత్రం ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగ కృష్ణ గౌడ్ నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు, పెద్దలు, అభ్యర్థులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమావళి గురించి వివరణ ఇచ్చారు. “ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయంగా, అహింసాత్మకంగా జరగాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాలి” అని సూచించారు.
ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, డబ్బు లేదా బహుమతుల పంపిణీ, బెదిరింపులు వంటి అక్రమ కార్యకలాపాలను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని, గ్రామంలో ఎటువంటి సంఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామంలోని శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే విధుల్లో ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శివానందంతో పాటు పోలీసు సిబ్బంది, గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









