తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని లింగారెడ్డిపేట్ బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటనలో కీలక మలుపు తిరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసులో స్పష్టత తీసుకువచ్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితుడు ర్యాపని హనుమంతు (40), కులం వడ్డెర, వృత్తి స్క్రాప్ సేకరణ, ధర్మరావ్ పేట్ గ్రామం, సదాశివనగర్ మండలం, కామారెడ్డి జిల్లాకు చెందినవాడు. కుటుంబ సమస్యల కారణంగా గత కొంతకాలంగా రోడ్లపై, బస్టాప్‌ల వద్ద నివసిస్తూ స్క్రాప్ సేకరించడమే తన జీవనాధారమని చెప్పినట్లు వెల్లడించారు.
గత రెండు నెలలుగా తూప్రాన్ టోల్ గేట్ ప్రాంతంలో స్క్రాప్ సేకరించి రాత్రిళ్లు లింగారెడ్డిపేట్ బస్టాప్‌లోనే గడిపేవాడని నిందితుడు తెలిపాడు. అదే బస్టాప్‌లో గత ఇరవై రోజులుగా మరో గుర్తు తెలియని వ్యక్తి కూడా ఉంటూ, తన సేకరించిన స్క్రాప్‌ను దొంగతనంగా అమ్మేస్తున్నాడనే అనుమానంతో తనపై అసహనం పెరిగిందని విచారణలో వెల్లడించాడు.
నిందితుడి ప్రకారం, నిన్న రాత్రి ఆ వ్యక్తి మద్యం సేవించి నిద్రలో ఉన్న సమయంలో, ముందుగా అతడి చేతులు–కాళ్లు తాళ్లతో కట్టి, తరువాత కట్టెతో తలకు దెబ్బకొట్టాడు. దాంతో మరణం సంభవించకపోవడంతో, నల్ల తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం గుర్తు పట్టకుండా ఉండేందుకు కట్టెలతో తల భాగాన్ని కాల్చేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు.
ఈ సమయంలో అక్కడుగా వెళ్లిన పోలీసు సిబ్బంది అనిల్, ఉమేష్ మంటలు గమనించి పై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ, ఎస్సై ప్రశ్నించగా నిందితుడు భయపడి మొత్తం ఘటనను వివరించినట్లు పోలీసులు తెలిపారు.
తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు అధికారులు ధృవీకరించారు.










