దుబ్బాక తూప్రాన్ డివిజన్: దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన మొదటి రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అపూర్వమైన ఘన విజయం సాధించింది. మొత్తం 141 గ్రామపంచాయతీ సీట్లకు గాను బీఆర్ఎస్ పార్టీ 84 స్థానాలను కైవసం చేసుకుని తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చాటిచెప్పింది.
ఈ ఫలితాలు కేవలం సంఖ్యల పరమైన విజయం మాత్రమే కాకుండా, గ్రామ స్థాయి నుంచి దుబ్బాక వరకు బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఉంచుకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనలో గ్రామాల అభివృద్ధికి వేసిన పటిష్టమైన పునాదులు నేటికీ ప్రజల మన్నన పొందుతున్నాయని ఈ ఎన్నికల తీర్పు స్పష్టంగా వెల్లడించింది.
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా “మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి” అన్న సంకల్పంతో ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అండగా నిలిచారు. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, రైతు–కూలీ–పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన పాలనకే ప్రజల మద్దతు లభించిందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఈ ఘన విజయానికి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసమే ప్రధాన బలంగా నిలిచింది. గ్రామాల్లో అభివృద్ధిని నేరుగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఆయన నిబద్ధతకు ఈ ఫలితాలు గట్టి ముద్రగా భావిస్తున్నారు.
అదే స్పూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పేలా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తాను మరింత బలంగా చాటిచెప్పేందుకు దుబ్బాక సిద్ధంగా ఉందని ఈ విజయాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ ఘన విజయానికి అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి గ్రామ ప్రజలకు బీఆర్ఎస్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
దుబ్బాకలో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని, కేసీఆర్ ఆశయాలతో గ్రామాల భవిష్యత్ మరింత వెలుగులు చిందించనుందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.










