- నలుగురికి తీవ్ర గాయాలు – రక్తపాతంగా మారిన ప్రమాదం
- భద్రతా చర్యల లోపమే కారణమా? యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం
మనోహరాబాద్ :మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం యావత్ జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. పరిశ్రమలోని బట్టీ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ భయానక దృశ్యాలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు అనుసర్ విశ్వకర్మ (37) బట్టీలో పడిపోవడంతో సజీవదహనమై దుర్మరణం పాలయ్యాడు.
పేలుడు సమయంలో అనుసర్ తీవ్రంగా అరుస్తూ ప్రాణాలు విడిచిన ఘటన అక్కడ ఉన్న తోటి కార్మికులను కన్నీళ్ల పర్యంతం చేసింది. భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించిన యాజమాన్య నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని కార్మికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
భద్రతా చర్యల లేమే ప్రమాదానికి మూలం
పరిశ్రమలో కనీస భద్రతా పరికరాలు లేకుండా కార్మికులతో పనిచేయిస్తున్నారని, రక్షణ దుస్తులు, హెచ్చరిక వ్యవస్థలు పూర్తిగా లేవని కార్మికులు వాపోతున్నారు. బట్టీల వద్ద తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. “ముందే ప్రమాదం జరుగుతుందని చెప్పాం… ఎవ్వరూ పట్టించుకోలేదు… ఇప్పుడు ఒక ప్రాణం పోయింది” అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నలుగురి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన రాజేష్ పండే, జితేంద్ర రాయి, అలాగే అన్వేష్, రీతూ అనే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే గాయపడిన కార్మికుల పూర్తి వివరాలను యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కన్నీటి పర్యంతమైన మృతుడి కుటుంబం
అనుసర్ విశ్వకర్మ మృతితో అతడి కుటుంబ సభ్యులు, సహచర కార్మికులు తల్లడిల్లిపోయారు. జీవనాధారం కోల్పోయిన కుటుంబం “మాకు న్యాయం కావాలి… కార్మికుడి ప్రాణం నిర్లక్ష్యంతో పోయింది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కుప్పకూలిపోవడం అక్కడ హృదయవిదారక దృశ్యంగా మారింది.

పరిశ్రమ ఎదుట కార్మికుల ఆందోళన
ఈ ప్రమాదానికి నిరసనగా పరిశ్రమ ఎదుట కార్మికులు భారీగా ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అధికారుల పరిశీలన
సమాచారం అందుకున్న వెంటనే తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ ఆధ్వర్యంలో మనోహరాబాద్ ఎస్‌ఐ సుభాష్ గౌడ్, తూప్రాన్ ఎస్‌ఐ శివానందం, శివ్వంపేట, వెల్దుర్తి ఎస్‌ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
న్యాయం కోరుతున్న కార్మికులు
యాజమాన్య నిర్లక్ష్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, మృతుడి కుటుంబానికి తక్షణమే భారీ పరిహారం అందించాలని, పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.










