మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తూప్రాన్ పట్టణంలోని టాటా కాఫీ వెనుక భాగంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 213లో సహజంగా ఏర్పడిన కొండలు, గుట్టలు ఒకప్పుడు ప్రకృతి వనరులుగా కళకళలాడాయి. అయితే ప్రస్తుతం అవి అక్రమ మట్టి వ్యాపారుల చేతుల్లో క్రమంగా కనుమరుగవుతున్నాయి.
భారీ హిటాచీలు, జేసీబీలను ఉపయోగిస్తూ రాత్రివేళల్లో గుట్టల్ని తవ్వి మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటూ మట్టి మాఫియా కోట్లకు పడగలెత్తుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ తదితర సంబంధిత శాఖల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నయానో భయానో అక్రమ వ్యాపారులు అధికారులకు ముట్టజెప్పుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అప్పుడప్పుడు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే సమాచారం అందుకుని యంత్రాలను పట్టుకొని వదిలేయడం తప్ప, పగడ్బందీ ప్రణాళికతో కేసులు నమోదు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిలోని సహజ వనరులను నాశనం చేస్తూ, ప్రకృతికి నిలయమైన కొండలు, గుట్టలను తవ్వి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ, కొండలను త్రవ్వి వచ్చిన మట్టిని గనేటుగా, కడీలుగా మార్చి మరో రూపంలో వ్యాపారం కొనసాగిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతోందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు మేల్కొని స్పందించి అక్రమ మట్టి వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాలని, వారిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయాలని సమీప గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.











