మెదక్ జిల్లా / మాసాయిపేట / తూప్రాన్ డివిజన్ : మాసాయిపేట మండలం జాతీయ రహదారిపై ఉన్న మాసాయిపేట దాబా సమీపంలో ప్రతిరోజూ భారత్ గ్యాస్ లోడింగ్ లారీలు హైదరాబాదు నుండి నిజాంబాద్ వైపు ప్రయాణిస్తున్నాయి. అయితే ఈ లారీలు నిండు గ్యాస్ సిలిండర్లతో దాబాల వద్ద నిలిపివేయడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.
గతంలో విజయవాడ రహదారి మార్గంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో బస్సులు అగ్నికి ఆహుతైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, నిండు సిలిండర్లతో ఉన్న వాహనాలను హోటళ్లు, దాబాల వద్ద నిలపకూడదని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి.
అయినప్పటికీ, మాసాయిపేట దాబా సమీపంలో గ్యాస్ సిలిండర్లతో ఉన్న లారీలు నిర్లక్ష్యంగా నిలిపివేయబడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి, జాతీయ రహదారిపై నిండు సిలిండర్లతో ఉన్న వాహనాలు నిలపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే తనిఖీలు నిర్వహించి నిబంధనలు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








